: మాచర్లలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గీయుల ఘర్షణ
గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకుగాను పోలీసులు లాఠీఛార్జి చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున మాచర్ల ఇన్ చార్జిగా ఉన్న చలమారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై వినాయక నిమజ్జన ర్యాలీ జరుగుతోంది. మరోవైపు వైఎస్ ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సారథ్యంలో ఆ పార్టీ శ్రేణులు కూడా వినాయక నిమజ్జన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ రెండు ర్యాలీలు కొనసాగుతున్న సమయంలోనే ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది క్రమంగా పరస్పర తోపులాటల వరకు వెళ్లింది. చివరకు ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.