: వ్యక్తిగత కక్షలతో తోటి మహిళ జడ కత్తిరించారు !
ఆ ఇద్దరు మహిళల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు ఎక్కడికి దారితీశాయంటే, అందులో ఒక మహిళ మరో మహిళ జడను కత్తిరించే దాకా! ఈ సంఘటన హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, సికింద్రాబాద్ బౌద్ధనగర్ కు చెందిన శ్రీవల్లి (28), అనిల్ కుమార్ భార్యాభర్తలు. అదే ప్రాంతానికి చెందిన పార్వతికి, శ్రీవల్లికి మధ్య వ్యక్తిగత కక్షలేవో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పార్వతి మరో ముగ్గురు మహిళలతో కలసి బైక్ లపై వెళ్లి శ్రీవల్లి ఇంట్లో చొరబడ్డారు. ఆమెపై దాడికి పాల్పడ్డారు. శ్రీవల్లి చేతులను కదలకుండా పట్టుకుని ఆమె జడను తన వెంట తెచ్చుకున్న కత్తెరతో పార్వతి కట్ చేసింది. దీంతో బాధితురాలు పక్కనే ఉన్న తన తల్లి ఇంటికి పరుగు పెట్టింది. పార్వతితో పాటు ఆ ముగ్గురు మహిళలు శ్రీవల్లిని వెంబడించి దాడి చేశారు. శ్రీవల్లి తల్లి వారికి అడ్డుపడటంతో ఆమెను గాయపర్చి, అక్కడ నుంచి పరారయ్యారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే తనపై వారు దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.