: శాన్ జోస్ లో మోదీకి లభించిన స్వాగతం బెట్టిదనిన..!


ఈ ఉదయం శాన్ జోస్ లో కాలుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి అధికారులతో పాటు, ప్రవాస భారతీయులు, ముఖ్యంగా సిక్కులు, గుజరాత్ కు చెందిన ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇక్కడి నార్మన్ వై.మింటీ శాన్ జోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సతీ సమేతంగా వచ్చిన నగర మేయర్ శామ్ లికార్డో, మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం నుంచి రెండు చేతులతో నమస్కరిస్కూ దిగివచ్చిన మోదీకి పుష్పగుచ్ఛం ఇచ్చి సిలికాన్ వ్యాలీకి స్వాగతం పలికారు. ఆపై తనను చూసేందుకు, వెల్ కమ్ చెప్పేందుకు భారీగా తరలివచ్చిన భారత సంతతి ప్రజలను పలకరిస్తూ, వారితో ఫోటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్ లు ఇస్తూ మోదీ ఉత్సాహంగా ముందుకు కదిలారు. హోటల్ ఫెయిర్ మౌంట్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాయకుడు కైలాష్ ఖేర్ పాటలు పాడుతూ మోదీని వేదికపైకి ఆహ్వానించగా, ఓ మహిళ ఆయన దగ్గరికి వెళ్లి చేతికి రాఖీ కట్టింది. మోదీ వెళ్లిన ప్రతి చోటా 'మోదీ మోదీ' అంటూ ప్రజల కేరింతలు వినిపించాయి. అత్యధికులు భారత జాతీయ పతాకాలతో కనిపించారు. 'వుయ్ సపోర్ట్ డిజిటల్ ఇండియా ', 'యూఎస్ఏ లవ్స్ ఇండియా' వంటి నినాదాలు రాసిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ లో తన స్పందనను తెలుపుతూ "శాన్ జోస్ లో నాకు గొప్ప స్వాగతం లభించింది. వచ్చే రెండు రోజుల కార్యక్రమాల కోసం ఎంతో ఆతృతతో వేచి చూస్తున్నాను" అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News