: కిడ్నాపర్ల చేతులు కొరికి తప్పించుకున్న 11 ఏళ్ల ధీశాలి


తనను కిడ్నాప్ చేయాలని చూసిన వారిని ధైర్యంగా ఎదిరించి బయటపడిన 11 ఏళ్ల బాలుడు ఇప్పుడు ఢిల్లీలో హీరోగా మారాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీలోని లజపత్ నగర్ లో చాక్లెట్లు కొనుక్కునేందుకు వంశ్ పూరి అనే బాలుడు బయటకు వచ్చాడు. బాలుడి వద్దకు అడ్రస్ అడిగే నిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి, ఓ కాగితం చూపి ఏదో అడుగుతున్నట్టు నటిస్తూ, పక్కనే నిలిపి వుంచిన కారులోకి బలవంతంగా నెట్టాడు. వాహనంలోకి ఎక్కించిన బాలుడి కళ్లు, నోరూ మూసేసారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత వాహనాన్ని ఆపి ఓ వ్యక్తి బయటకు దిగగా, తన సమయస్ఫూర్తికి పనిచెప్పిన బాలుడు ధైర్యంగా వ్యవహరించి, కారులో ఉన్న మరో వ్యక్తి చేతిని గట్టిగా కొరికి బయటకు దూకాడు. ఆ వెంటనే పక్కన పార్క్ చేసిన కార్ల వెనుక నక్కుతూ, వారి కంటబడకుండా తప్పించుకుని కృష్ణా మార్కెట్ సమీపంలో ఉన్న నానమ్మ ఇంటికి చేరి తండ్రికి విషయం తెలిపాడు. వాళ్ల ముఖాలకు ముసుగులు వేసుకున్నారని, వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులకు వివరించాడు. వంశ్, అతని తండ్రి అజయ్ పూరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా, అజయ్ పూరి లజపత్ నగర్, నెహ్రూ ప్యాలెస్ ప్రాంతాల్లో కామర్స్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. జంగ్ పురా ప్రాంతంలో తనకున్న ఆస్తులపై ఓ బ్యాంకు ఉద్యోగి కన్నేశాడని, గతంలో తనను పలుమార్లు బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అజయ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News