: తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన జీప్
తిరుమల మొదటి కనుమ దారిలో ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులోని 12వ మలుపు వద్ద భక్తులతో వస్తున్న జీప్ అదుపుతప్పింది. వేగంగా వస్తున్న జీపుపై కంట్రోల్ కోల్పోయిన డ్రైవర్ దాన్ని పిట్టగోడకు ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. పిట్టగోడను ఢీకొట్టిన జీపు పక్కనే ఉన్న లోయలోకి జారకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలుసుకున్న అధికారులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, మొదటి ఘాట్ రోడ్డులో 12 నుంచి 20 నంబర్ల వరకూ ఉండే మలుపులు ప్రమాదకరంగా ఉంటాయి. దీంతో, ఈ ప్రాంతంలో నిదానంగా వెళ్లాలని సూచించే బోర్డులు అనేకం ఉన్నప్పటికీ, ఆ సూచనలను పాటించని వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి.