: స్పీకర్ నుంచి మంత్రి వర్గంలోకి కోడెల!


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా విధులు నిర్వహిస్తున్న కోడెల శివప్రసాదరావును త్వరలో చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా పండగ సీజన్ లో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో, కోడెల చేరిక ఖాయమని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. అయితే, దసరా రోజున అమరావతి శంకుస్థాపన ఉండటం, దానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానుండటంతో, క్యాబినెట్ మార్పులు దసరా నాడు జరిగే అవకాశాలు లేవు. అంతకుముందే మార్పు చేర్పులుంటాయా? లేక పండగ తరువాత మంత్రివర్గం మారుతుందా? అన్న విషయమై స్పష్టత వెలువడాల్సి వుంది. కాగా, ఇప్పుడున్న మంత్రులు కొందరికి ఉద్వాసన తప్పదని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పలు శాఖల్లో అవినీతి రెండంకెల స్థాయికి చేరిందని చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ శాఖల మంత్రుల మార్పు ఖాయంగా తెలుస్తోంది. తాను స్వయంగా చూసుకుంటున్న విద్యుత్ శాఖను మరొకరికి అప్పగించడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖను కోడెలకు ఇచ్చి; ప్రత్తిపాటి పుల్లారావు చేతుల్లో వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖలు ఉండటంతో, ఆయనకు కొంత వెసులుబాటును కల్పిస్తూ, మార్కెటింగ్ శాఖను వేరొకరికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పల్లె రఘునాథరెడ్డి వద్ద ఐటీ సహా ఆరు శాఖలు ఉండగా, ఐటీ శాఖను మరొకరికి ఇవ్వవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News