: ప్రపంచాన్ని మార్చేది ఇదొక్కటే: మోదీ
ప్రపంచ ఆలోచనను మార్చే సత్తా ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వాడకం విస్తృతమైన తరువాత ప్రజల మధ్య సామాజిక అంతరాలు తగ్గిపోతున్నాయని ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మోదీ వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతి ఐటీ కంపెనీకీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు వివరించారు. ఇండియాలోని 125 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ కనెక్టివిటీని అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే బ్రాడ్ బ్యాండ్ వినియోగం 63 శాతం పెరిగిందని మోదీ వివరించారు. దీన్ని మరింతగా విస్తరిస్తామని, ప్రతి పల్లెలోని ప్రతి కుటుంబానికీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు దగ్గర చేస్తామని వివరించారు. అంతకన్నా ముందు కళాశాలలు, వర్శిటీలు, హాస్టళ్లు, అన్ని రహదారులు, పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్రాంతాలు తదితరాలను డిజిటల్ గొడుగు కిందకు తీసుకువస్తామని తెలిపారు. కేవలం ఎయిర్ పోర్టు లాంజీల్లో మాత్రమే కాకుండా, అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే 500కు పైగా రైల్వే స్టేషన్లలో వైఫై సిగ్నల్స్ ను ఉచితంగా అందిస్తున్నామని, దీన్ని 5 వేల స్టేషన్లకు పెంచుతామని అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని ఆయన కోరారు. డిజిటల్ యుగంలో దశాబ్దాల క్రితం ఊహకు కూడా అందని విధంగా ప్రజల జీవితాలను మార్చే అవకాశాలు ఉన్నాయని మోదీ వ్యాఖ్యానించారు.