: వాసన చూసి పదాలను గుర్తించే అద్భుత నైపుణ్యం ఆ బాలుడి సొంతం!
కళ్లకు గంతలు కట్టుకుని ఓ పుస్తకాన్ని చదవమంటే మీరు ఏం చేస్తారు? 'అలా ఎలా సాధ్యం?' అని ప్రశ్నించడం తప్ప మరేమీ చేయలేరు. కానీ కోయంబత్తూరుకు చెందిన మాధేశ్వరన్ తన అసాధారణ నైపుణ్యంతో కళ్లకు గంతలతో పుస్తకాలు ఇట్టే చదువుతాడు. అంతేకాదు, మొబైల్ ఫోన్లో వచ్చే మెసేజ్ లు కూడా చదివేస్తాడట. ప్రతి కాగితానికీ ఓ వాసన ఉన్నట్టే, ప్రతి పదానికీ ఓ ప్రత్యేకమైన వాసన ఉంటుందని, దాన్ని బట్టి తాను గుర్తిస్తానని చెప్పే మాధేశ్వరన్, ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. ఇటీవలి త్రైమాసిక పరీక్షల్లో తోటి విద్యార్థులకు భిన్నంగా కళ్లకు గంతలతో సమాధానాలు రాసి ఉపాధ్యాయులకు సైతం ఆశ్చర్యం కలిగించాడు. విద్యార్థి ఫోటోలు తీసి మీడియాకు అందించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. తమ కుమారుడిని 'బ్రెయిన్ ఫోల్డ్ యాక్టివేషన్' కార్యక్రమానికి పంపిన తరువాత ఈ అసాధారణ నైపుణ్యం వచ్చిందని మాధేశ్వరన్ తల్లిదండ్రులు చెబుతున్నారు.