: తక్షణం నిలుపుతారా? వాటా ఇస్తారా?: పట్టిసీమపై కేసీఆర్ సర్కారు
పట్టిసీమ పథకంతో తెలంగాణకు తీవ్ర నీటి కష్టాలు వస్తాయని, ఈ ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు పట్టిసీమ ప్రాజెక్టుపై ఇప్పటికే పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీఎస్ సర్కారు, మరోసారి ఏపీ ప్రభుత్వానికి, గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులకు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తోడితే, తెలంగాణ పరిస్థితి ఏంటని ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు రాసిన లేఖలో ప్రశ్నించింది. పట్టిసీమ ప్రాజెక్టు సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై ముందుకు సాగితే, కృష్ణా నీటిలో తమ వాటాను పెంచాలని డిమాండ్ చేసింది. కాగా, దీనిపై గట్టిగానే సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల జలాల్లో ఏపీకి వాటా ఇస్తారా? అని అడగనున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు అక్టోబర్ 7న భేటీ కానున్నట్టు సమాచారం.