: బొడ్డుతాడు కోయబోయి పీక కోసిన పీజీ వైద్యులు!


పీజీ వైద్యుల నిర్లక్ష్యం అప్పుడే జన్మించిన పసిబిడ్డ ప్రాణాలను బలిగొంది. బిడ్డ మెడకు బొడ్డుతాడు చుట్టుకుని ఉండటంతో దాన్ని కోయబోయిన వైద్యులు పసికందు పీక కోసి ఓ తల్లికి తీరని వేదనను మిగిల్చారు. ఈ ఘటన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, వెల్దుర్తికి చెందిన ప్రైవేటు పాఠశాల టీచర్ నబీ రసూల్ భార్య షబానా తన ఐదవ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరి మగబిడ్డను ప్రసవించింది. బిడ్డ పుట్టిన తరువాత మెడ చుట్టూ ఉన్న బొడ్డు తాడును తొలగించే క్రమంలో మెడ తెగింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన చిన్నారికి అత్యవసర చికిత్స చేసినా ప్రాణాలు మిగల్లేదు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించిందని నబీ రసూల్ ఆరోపించారు. కాగా, ఈ కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గరుండగానే ఈ ప్రమాదం జరిగిందని, పీజీ వైద్యులే బొడ్డుతాడు తొలగించే క్రమంలో ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News