: మీరు ఎటువంటి ఊహాగానాలతోను ఈ సినిమాకి రావద్దు: ప్రేక్షకులకు అనుష్క సూచన
చారిత్రాత్మక సినిమా 'రుద్రమదేవి'కి ప్రేక్షకులు సొంత ఆలోచనలు, ఊహాగానాలతో రావద్దని సినీ నటి అనుష్క సూచించింది. కాకతీయ చరిత్రపై పరిశోధన చేసి, వాస్తవాలతో గుణశేఖర్ ఈ సినిమా నిర్మించారని అనుష్క తెలిపింది. ఎలాంటి ఊహాగానాలు లేకుండా, ప్రశాంతంగా వచ్చి సినిమా చూసి ఆనందించాలని అనుష్క స్పష్టం చేసింది. సినిమాను ఎంతో కష్టపడి తీశారని, దానిని అలాగే చూడాలని అనుష్క తెలిపింది. అందరూ సినిమాను ఆదరించాలని, సినిమాను వీలైనంతలో అద్భుతంగా తీర్చిదిద్దారని అనుష్క వివరించింది. ఇదిలా ఉంచితే, అక్టోబర్ 9న విడుదల కావలసిన ఈ చిత్రం వాయిదా పడిందంటూ ఈ రోజు వార్తలు షికారు చేసిన నేపథ్యంలో, దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ, ఈ వార్తల్లో వాస్తవం లేదని, అక్టోబర్ 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని వివరణ ఇచ్చారు.