: యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వ్యక్తులు
భూ వివాదం నేపథ్యంలో ఒక యువతిని సజీవదహనం చేసేందుకు ఓ మహిళ సహా నలుగురు వ్యక్తులు యత్నించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో జరిగింది. ఈ విషయమై బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రతాప్ గఢ్ లోని సిర్పూర్ గ్రామంలో కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న యువతిని నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఓం ప్రకాష్ మౌర్య, అతడి భార్య, మరో ఇద్దరు కలిసి యువతిపై కిరోసిన్ పోసి ఆమెను సజీవదహనం చేసేందుకు యత్నించారు. మంటల వేడి తట్టుకోలేని ఆ యువతి పెద్దపెద్దగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. యువతి శరీరం చాలా భాగం కాలిపోయింది. బాధితురాలిని అలహాబాద్ లోని ఒక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.