: నితీశ్ ను ఓడించడమే ఏకైక లక్ష్యమంటున్న బీహార్ మాజీ సీఎం
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను ఎలాగైనా ఓడించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, హిందుస్తానీ అవామ్ మోర్చా (హమ్) అధ్యక్షుడు జితన్ రాం మాంఝీ కంకణం కట్టుకున్నారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని చెబుతున్నారు. మరోసారి తాను విజయం సాధించి సీఎం అయితే బీహార్ ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ సెక్యులర్ పార్టీ కాదన్న మహాకూటమి వ్యాఖ్యలను మాంఝీ ఖండించారు. 1990 దశకంలో బీజేపీ మద్దతుతోనే లాలూ ప్రసాద్ యాదవ్ గద్దెనెక్కిన సమయంలో ఆ పార్టీ సెక్యులర్ అయినప్పుడు, ఇప్పుడు ఏ అర్హతతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 20 స్థానాల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.