: డబ్బుకట్టలిచ్చిన వారికే బీహార్ అసెంబ్లీ టికెట్లు: బీజేపీపై సొంత పార్టీ నేత ఆరోపణలు


బీహార్ అసెంబ్లీ టికెట్లను భారతీయ జనతా పార్టీ నేతలు అమ్ముకున్నారంటూ ఆ పార్టీకి చెందిన నేత, మాజీ హోం శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ఆరోపించారు. డబ్బులిచ్చిన వారికే టికెట్లు ఇచ్చారంటూ ఆయన మండిపడ్డారు. ‘నేరగాళ్లకు అసెంబ్లీ టికెట్లు యిస్తున్నారు. ఇట్లాంటి పనులు చేస్తే బీజేపీ స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని ఏ విధంగా అందిస్తుంది? నేరగాళ్లకు అసెంబ్లీ టికెట్లు అమ్ముకోవడంపై బీజేపీ కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు. బీహార్ ప్రజలకు బీజేపీ అన్యాయం చేస్తోంది’ అని ఆర్.కే.సింగ్ మండిపడ్డారు. పాట్నాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అసెంబ్లీ టికెట్ల పంపిణీ మొదలవ్వగానే సుశీల్ కుమార్ మోదీకి నేను ఫోన్ చేశాను. కానీ, నా ఫోన్ కాల్ ఆయన రిసీవ్ చేసుకోలేదు’ అని ఆర్.కే.సింగ్ చెప్పారు. దీనికి స్పందించిన సుశీల్ మోదీ ఇటువంటి సమయంలో ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయని, అందరితో మాట్లాడటం సాధ్యమయ్యే పని కాదని అన్నారు. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్లు లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు. డబ్బుమూటలిచ్చిన వారికే ప్రాధాన్యమిచ్చారన్నారు. ఆర్.కే.సింగ్ ఆరోపణలపై జేడీ(యు)నేత పవన్ వర్మ మాట్లాడుతూ ఆర్.కె.సింగ్ చెప్పిన విషయం బీజేపీ నేతలకు మింగుడుపడదని, ఆ పార్టీ నేతలు ఏవిధంగా ఉంటారనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు.

  • Loading...

More Telugu News