: భారత రాయబారికి సమన్లు పంపిన నేపాల్
గత మూడు రోజుల నుంచి నేపాల్ లోని భారత సరిహద్దువైపు ఉన్న ప్రాంతాల్లో శాంతి భద్రతలు క్షీణించాయి. కొత్త రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసులపై కూడా రాళ్లతో దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో, నేపాల్ కు ఆనుకుని ఉన్న భారత రాష్ట్రం బీహార్ లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీహార్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నేపాల్ వైపు వెళ్లరాదంటూ లౌడ్ స్పీకర్లతో అనౌన్స్ చేస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరక్కూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ నుంచి నేపాల్ కు వెళ్లే అంతర్జాతీయ మార్గాలను భద్రతాదళాలు మూసివేశాయి. ఈ నేపథ్యంలో, నేపాల్ కు భారత్ నుంచి ప్రతిరోజు రవాణా అయ్యే నిత్యావసరాలు నిలిచిపోయాయి. దీంతో, నేపాల్ లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో, నేపాల్ లోని భారత రాయబారికి ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. నేపాల్ పై వాణిజ్యపరమైన ఆంక్షలను భారత్ ఏమైనా విధించిందా? అంటూ సందేహాన్ని వెలిబుచ్చింది.