: అంతా అవినీతి...ఆత్మహత్యే గతి: ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్న కాంట్రాక్టర్ సూసైడ్ నోట్
‘‘అంతా అవినీతి. వ్యాపారాన్నే కాక శక్తినీ కోల్పోయా. అవినీతిపై పోరు సాగించాలా?, ఆత్మహత్య చేసుకోవాలా?’’ అంటూ ఓ చిరు కాంట్రాక్టర్ పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకెళితే... హైదరాబాదు గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ కు చెందిన వడ్లమూడి రవికుమార్ అనే వ్యక్తి హైదరాబాదు తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బీ)లో చిన్నపాటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోంది. పనులను ఎంబుక్ లో నమోదు చేసేందుకు ఇంజినీర్ డబ్బులడిగాడట. అయితే సదరు అధికారికి ఇచ్చేందుకు రవికుమార్ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. అప్పటికే పనుల కోసం కుటుంబ సభ్యుల బంగారాన్ని కుదువపెట్టిన అతడు తెలిసిన వాళ్ల దగ్గర చేబదులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంజినీర్ లంచాలడిగిన విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, స్పందన లభించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రవికుమార్ ఆత్మహత్య తప్ప తనకు వేరే మార్గం లేదని భావించాడు. నిన్న తెలంగాణ సీఎం పేషికి ఫిర్యాదు చేస్తూ ఓ సందేశాన్ని పంపిన రవికుమార్ సూసైడ్ నోట్ రాసేశాడు. దానిని ఫేస్ బుక్ లో పెట్టేసి అదృశ్యమయ్యాడు. ఈ పోస్ట్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. అయితే రవికుమార్ ఎక్కడున్నాడన్న విషయం తేలలేదు.