: మాజీ ప్రధాని మనవడిని తెరకు పరిచయం చేయనున్న టాలీవుడ్ డైరెక్టర్
తాత దేవేగౌడ మాజీ ప్రధాని, తండ్రి కుమారస్వామి మాజీ సీఎం... అయినా కన్నడనాట తెరగేంట్రం చేసేందుకు నిఖిల్ గౌడకు అన్నీ అనుకూలించేందుకు చాలా సమయమే పట్టింది. తన తండ్రి మాజీ సీఎంగానే కాక చలనచిత్ర రంగంలో డిస్ట్రిబ్యూటర్ గానూ సుప్రసిద్ధులు. అయినా నిఖిల్ గౌడ తన కోరిక తీర్చుకునేందుకు దాదాపుగా ఏడాదిగా వేచి చూడక తప్పలేదు. ఇందుకోసం నిఖిల్ గౌడ కన్నడ దర్శకులను కాదని టాలీవుడ్ దాకా వచ్చేయక తప్పలేదు. స్టార్ హీరోల వారసులను తెరంగేట్రం చేయించడంలో ఆరితేరిన టాలీవుడ్ హిట్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను నిఖిల్ గౌడ తండ్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంప్రదించారు. ఏకంగా కుమారస్వామి నుంచి కాల్ రావడంతో పూరీ జగన్నాధ్ కాదనలేకపోయారట. నిఖిల్ గౌడను తెరంగేట్రం చేయించేందుకు పూరీ జగన్నాధ్ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'లోఫర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న పూరీ, ఈ చిత్రం షూటింగ్ పూర్తైన వెంటనే నిఖిల్ గౌడ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారట.