: మంత్రి తలసానిపై ఫిర్యాదులకు గవర్నర్ కార్యాలయం స్పందన... టి.సీఎస్ కు లేఖ
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పై వస్తున్న ఫిర్యాదులపై ఎట్టకేలకు గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆయనపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ టి.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఇవాళ లేఖ రాశారు. గతేడాది ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని తరువాత పార్టీ ఫిరాయించారు. టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుమార్లు టి.టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ జీవో కాపీలను, తలసాని రాజీనామా లేఖను ఫిర్యాదుకు జత చేసి అప్పట్టో గవర్నర్ కు సమర్పించారు. మరి తెలంగాణ సీఎస్ గవర్నర్ కార్యాలయ లేఖపై ఎలా స్పందిస్తారనేది చూడాలి!