: సామాజిక మాధ్యమాల సహకారంతో ఎల్లలు దాటి తల్లి చెంతకు చేరిన బాలుడు


మానవ జీవితంలో సామాజిక మాధ్యమాలు ఎంతగా మిళితమైపోయాయో వెల్లడించే మరో ఘటన ఇది. ఇంటి నుంచి పారిపోయిన ఐదేళ్ల తరువాత ఓ బాలుడు సోషల్ మీడియా సహకారంతో తిరిగి తన తల్లి చెంతకు చేరాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పాకిస్థాన్‌కు చెందిన బేగమ్ రజియా, మహ్మద్ కాజోల్ దంపతులకు, మహ్మద్ రంజాన్ అనే కొడుకు ఉన్నాడు. 2011లో భార్యాభర్తలు విడిపోగా, మహ్మద్ తన కొడుకును తీసుకుని బంగ్లాదేశ్ వెళ్లి, అక్కడే స్థిరపడి మరో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి సరిగా చూసుకోకపోవడంతో రంజాన్ ఇంట్లో నుంచి పారిపోయి పాకిస్థాన్ చేరుకోవాలని బయలుదేరాడు. ఇండియాకు రాగలిగిన బాలుడు, రాంచీ, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలు తిరిగాడు. ఢిల్లీ వీధుల్లో పోలీసులకు తారసపడ్డ రంజాన్ ను 2013 అక్టోబర్‌లో ఒక అనాథ ఆశ్రమానికి అప్పగించారు. అక్కడ రంజాన్‌ కు హంజా బాసిత్ అనే సీఏ చదువుతున్న విద్యార్థి పరిచయమై, సోషల్‌ మీడియా ద్వారా రంజాన్ కథను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో, కరాచీలోని ఓ సామాజిక కార్యకర్త దాన్ని చూశాడు. రంజాన్ ఫోటో, వివరాలతో కూడిన పోస్టర్లు ప్రింట్ వేయించి పాకిస్థాన్ అంతటా అతికించేలా చేశాడు. ఈ ప్రయత్నం ఫలించింది. రంజాన్ తల్లి బేగమ్ రజియాకు విషయం తెలిసి కొడుకు కోసం వచ్చింది. ఇప్పుడు రంజాన్ తన తల్లి చెంతకు చేరి నిశ్చింతగా చదువుకొంటున్నాడు.

  • Loading...

More Telugu News