: చంద్రబాబును విమర్శించడం మాని జగన్ కేంద్రంపై పోరాడాలి: సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. ఈ విషయాలపై అనవసరంగా సీఎం చంద్రబాబును విమర్శించడం మానుకోవాలని సూచించారు. అసలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్న సోమిరెడ్డి, ఈ విషయంలో చంద్రబాబునే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించారు. విభజన చట్టం అమలుకు తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, ప్రపంచబ్యాంక్ నివేదిక జగన్ కు కనిపించడం లేదా? అని సూటిగా నిలదీశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి ఈ మేరకు మాట్లాడారు. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావును జగన్ కలవడంపై మాట్లాడుతూ, జగన్ జైలుకెళ్లే పరిస్థితి రావడంతోనే రామోజీ దగ్గరకు వెళ్లారని ఆరోపించారు. అసలు ఆయనను ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రామోజీని ఒక్కరోజైనా జైలులో ఉంచాలని ఒకప్పుడు దివంగత వైఎస్, జగన్ అనుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ ధర్నాతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని, అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడంతోనే ఆ మహిళ చనిపోయిందని అన్నారు.