: హాజీలకు మోస్ట్ డేంజరస్... అసలు సైతానును రాళ్లతో ఎందుకు కొట్టాలి?
హజ్ యాత్ర చేస్తున్న హాజీలు ఈద్ అల్-అధా (10వ రోజు) నాడు సైతానును రాళ్లతో కొడితేనే తమ యాత్ర పరిసమాప్తమవుతుందని గట్టిగా నమ్ముతారు. ఈ పవిత్ర దినాన ఉదయం ప్రార్థనలు ముగియగానే లక్షలాది మంది ఒక్కసారిగా సైతానును రాళ్లతో కొట్టేందుకు వస్తారు. వారిని నియంత్రించి, వరుస క్రమంలో పంపేందుకు సౌదీ ప్రభుత్వం, లక్షల మంది భద్రతా అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఒక్కోసారి దురదృష్టం వెంటాడుతుంది. నిన్న మినాలో అదే జరిగింది. సైతానును రాళ్లతో కొట్టి తమ యాత్రను ముగించాలన్న తొందరలో ఉన్న యాత్రికులను నియంత్రించడంలో అధికారులు విఫలం కాగా, దాదాపు 800 మంది మృత్యువాత పడ్డ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో అసలు సైతానును రాళ్లతో ఎందుకు కొట్టాలో తెలుసుకుంటే... హజ్ యాత్రలో భాగంగా సైతానుగా భావించే మూడు రాళ్లను ముస్లిములు రాళ్లతో కొడతారు. ఈ సంప్రదాయం వెనుక ఓ కథ ఉంది. అబ్రహాంకు కలలో కనిపించిన దేవుడు, "నీ కుమారుడు ఇస్మాయిల్ ను బలి ఇస్తే, ముస్లిం సమాజానికి మేలు కలుగుతుంది" అని చెప్పాడట. దీంతో ఇస్మాయిల్ కు విషయాన్ని చెబితే, వెంటనే తనను దేవునికి అప్పగించాలని, తక్షణం వధించాలని కోరాడు. కడుపున పుట్టిన బిడ్డను వధించేందుకు అబ్రహాం సిద్ధపడిన వేళ, అతని వధతో తనకు అంతం తప్పదని భావించిన సైతాను, అబ్రహాంను అడ్డుకునేందుకు మూడుసార్లు ప్రయత్నించింది. సైతాను ప్రత్యక్షమై తన మనసును మార్చాలని ప్రయత్నించిన ప్రతిసారీ అబ్రహాం దాన్ని రాళ్లతో కొట్టి తరిమాడు. ఒక్కోసారి ఏడు రాళ్లు వేస్తూ, సైతానును అక్కడ లేకుండా చూసి తన కొడుకును బలి ఇస్తాడు. ఈ ప్రాంతంలో సైతానుకు ఆనవాళ్లుగా మూడు రాళ్లు మిగిలాయి. అబ్రహం చేసిన త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకునేందుకు ఆ సైతాను రూపంలోని రాళ్లను యాత్రికులు రాళ్లతో కొడతారు. వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో, మూడు రాళ్లను మూడు పెద్ద పెద్ద గోడల రూపంలోకి మార్చిన సౌదీ ప్రభుత్వం వేల మంది ఒకేసారి రాళ్లను విసిరే ఏర్పాటు చేసింది. హజ్ యాత్ర ముగింపు రోజున ఈ రాళ్లు విసిరే ప్రక్రియ, మొత్తం యాత్రలో అత్యంత ప్రమాదకరం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉన్నా, తొక్కిసలాట జరిగి వందలాది మంది మరణించడం దురదృష్టకరం.