: రహస్య ఫైళ్లలో కొత్త విషయం... బోస్ కన్నా ఆయన సోదరుడిని చూసి భయపడ్డ తెల్ల దొరలు!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్నా, ఆయన సోదరుడు శరత్ బోస్ ను చూసి బ్రిటీష్ అధికారులు అధికంగా భయపడ్డారట. సుభాష్ వెనకున్న ప్రధాన శక్తి శరతేనని, అప్పటి బ్రిటీష్ పోలీసు అధికారి చార్లెస్ తెగార్ట్ ఇచ్చిన నివేదిక వివరాలు బోస్ కు సంబంధించి ఇటీవల బహిర్గతమైన ఫైళ్లలో వెల్లడయ్యాయి. శరత్ చేస్తున్న చర్యలతో బ్రిటీష్ పాలనకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించిన శరత్ బోస్, ఆపై స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా మిగిలారట. 1949లో దక్షిణ కోల్ కతా నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని శరత్ ఓడించి నెహ్రూకు సవాల్ విసిరారు. అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీసీ ఘోష్ నేతృత్వంలోని సర్కారును కూల్చాలని కూడా శరత్ ప్రణాళికలు రూపొందించినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది. శరత్ పైనా, ఆయన కుటుంబంపైనా నెహ్రూ సర్కారు సంవత్సరాల తరబడి నిఘాను పెట్టినట్టు ఈ పత్రాల్లో స్పష్టమైన సంగతి తెలిసిందే.