: చంద్రబాబుతో లగడపాటి భేటీ... త్వరలో ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ పుకార్లు


నిన్న జరిగిన రెండు ప్రత్యేక భేటీలు తెలుగు ప్రజలను తీవ్ర విస్మయానికి గురి చేశాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఫిల్మ్ సిటీ వెళ్లి ‘ఈనాడు’ చైర్మన్ రామోజీరావును కలిశారు. ఈ భేటీకి కాస్త అటు ఇటుగా ఢిల్లీలో తెలుగు నేలకు చెందిన ఇద్దరు రాజకీయ ప్రముఖుల మధ్య భేటీ జరిగింది. ఏపీ భవన్ లో జరిగిన ఈ భేటీలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు వీరిద్దరూ చర్చించుకున్నారు. ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల సమక్షంలో జరిగిన ఈ భేటీలో రాజకీయ అంశాలేమీ ప్రస్తావనకు రాలేదని సమాచారం. ల్యాంకో కంపెనీల చైర్మన్ హోదాలోనే చంద్రబాబుతో భేటీ అయిన రాజగోపాల్ వ్యాపార అంశాలనే ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజగోపాల్ మొన్నటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న ఆయన ఆ పార్టీ కార్యక్రమాలకూ హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో రాజగోపాల్ భేటీ కీలక పరిణామానికి నాంది పలకనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే రాజగోపాల్ టీడీపీలో చేరనున్నారని, ఇందుకు సన్నాహకంగానే చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News