: కోల్ కతాలో డబ్బుల మూటలు... గోనె సంచులు, ట్రావెల్ బ్యాగులు, అల్మారాల్లో కుక్కేశారు!


పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో నిన్న ఆదాయ పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు స్ధానిక పోలీసుల సహకారంతో నగరంలోని అలీపూర్, శరత్ బోస్ రోడ్డులో కొన్ని కార్యాలయాలపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమ పద్ధతుల్లో పోగేసిన దాదాపు రూ.45 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించిన నకిలీ లాటరీ రాకెట్ ను నడుపుతున్న ముఠాకు చెందిన డబ్బుగా దీనిని గుర్తించారు. జి.సిస్టమ్స్, ఎస్పీ ఎంటర్ ప్రైజెస్ సంస్థలకు చెందిన డబ్బుగా దీనిని నిర్ధారించిన ఆ శాఖ అధికారులు ఈ సంస్థలకు చెందిన నాగార్జున, సాంటియాగో మార్టిస్ లను నిందితులుగా గుర్తించారు. 16 గోనె సంచులు, 27 ట్రావెల్ బ్యాగులు, రెండు అల్మారాల్లో నిందితులు ఈ డబ్బును దాచివుంచారు. గుట్టలుగా దొరికిన డబ్బును లెక్కించేందుకు ఆదాయపన్ను శాఖ ఏకంగా 12 కౌంటింగ్ మిషన్లను వినియోగించింది. మొత్తం డబ్బును లెక్కించగా, రూ.45 కోట్లుగా తేలిందని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పంపేందుకే ఈ డబ్బును నిందితులు రెడీ చేసి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News