: రాష్ట్ర ప్రజలపై బాబు కక్షకట్టారు: బొత్స


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకహోదా కావాలని అడిగే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కక్షగడుతున్నారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20న జగన్ దీక్షపై అధికారులకు తమ పార్టీ నేతలు సమాచారమిచ్చారని అన్నారు. 90 శాతం ఏర్పాట్లు పూర్తైన తరువాత దీక్షకు అనుమతి లేదని చెప్పడం దారుణమని అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి సహా టీడీపీ నేతలు రాష్ట్ర ప్రజలపై కక్షగట్టారని, అందుకే ప్రత్యేకహోదా గురించి ఉద్దేశించిన దీక్షను అడ్డుకున్నారని తెలిపారు. ప్రత్యేకహోదా ప్రజల హక్కు అని, ప్యాకేజీ కాదని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా వస్తే ప్రజలకు నేరుగా ప్రయోజనాలు అందుతాయని, ప్యాకేజీ అయితే మంత్రి వర్గానికి వస్తుందని తెలిసిన టీడీపీ నేతలు ప్రత్యేకహోదాపై ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. జగన్ దీక్ష చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదా కోసం అధికారపక్షం చేయాల్సిన పనిని విపక్షం చేస్తుంటే ప్రోత్సహించకుండా ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారని ఆయన అడిగారు. ఢిల్లీలో దీక్ష చేసిన తరువాతే ఏపీలో దీక్ష చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News