: రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించాలని కోరాను: చంద్రబాబు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పునర్విభజన సందర్భంగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని, అవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టామని చెప్పారు. వాటన్నింటికీ కేంద్రం పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఏపీ రైతుల సమస్యలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వివరించామని అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరామని ఆయన తెలిపారు. పొగాకు రైతులకు న్యాయం చేయాలని సూచించామని, అలాగే పోర్టుల అభివృద్ధికి సహకరించాలని, బిల్లులో పేర్కొన్నట్టుగా నిధులు విడుదల చేయాలని కోరామని ఆయన వివరించారు. ఉభయగోదావరి జిల్లాల్లో పెట్రోలియం యూనివర్సిటీ గురించి అడిగామని చెప్పారు. మత్స్యకారులకు కేజ్ కల్చర్ వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక నిధులు అందజేయాలని సూచించినట్టు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు రానున్నాయని ఆయన తెలిపారు. ఇందుకోసం కేంద్ర విమానయానశాఖ మంత్రితో భేటీ అయ్యానని చెప్పారు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించాలని కోరామని చెప్పారు. అమరావతి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి అనంతపురం పట్టణాలకు నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని కోరామని, దానికి జాతీయ రహదారి హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆయన వివరించారు. దేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా నదుల అనుసంధానం చేశామని కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతికి చెప్పామని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరామని ఆయన తెలిపారు. పోలవరం పూర్తి చేయాలని కోరామని ఆయన చెప్పారు. రికార్డు స్థాయిలో రాజధానికి భూములు సేకరించామని ఆయన తెలిపారు.