: మక్కా తొక్కిసలాట ఎలా జరిగిందంటే..!
కొద్ది సేపటి క్రితం పవిత్ర మక్కాలో జరిగిన పెను తొక్కిసలాటలో, 100 మందికి పైగా మృతి చెందిన ఘోర విషాద ఘటన తెలిసిందే. రేపు బక్రీద్ పర్వదినం ఉండటం, హజ్ యాత్ర కొనసాగుతుండటంతో లక్షల సంఖ్యలో ముస్లిం యాత్రికులు మక్కాకు చేరుకున్నారు. వీరిలో అత్యధికులు సైతానుపై రాళ్లు విసిరి, తమ యాత్రను ముగించుకునేందుకు వచ్చారు. వస్తున్న యాత్రికుల సంఖ్య, కాబా సమీపంలో ఉన్న స్థలం వివరాలు అంచనా వేయడంలో అధికారులు సైతం విఫలమయ్యారు. యాత్రికులు విసిరిన కొన్ని రాళ్లు ఇతరులపై పడటంతో తొక్కిసలాట మొదలైనట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా అందరూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇప్పటికే హజ్ యాత్రకోసం ఇండియా నుంచి వేల సంఖ్యలో ప్రజలు మక్కాకు చేరుకుని ఉండటం, మృతుల వివరాలు ఇంకా వెల్లడి కాకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు సౌదీ సర్కారు వెల్లడించింది.