: తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలుకుతూ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ యూట్యూబ్ లో పెట్టిన వీడియో సందేశం హల్ చల్ చేస్తోంది. "మోదీ పర్యటనపై గూగుల్ ఉద్యోగులు, భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారాంతంలో ఆయనకు స్వాగతం పలికేందుకు సిలికాన్ వ్యాలీ సిద్ధంగా ఉంది. ఆయన రాకకోసం వేల మంది ఎదురుచూస్తున్నారు. మోదీ పర్యటన ఇక్కడి ఉద్యోగులను మరింత శక్తిమంతం చేస్తుందని భావిస్తున్నాను. ఇండియా, సిలికాన్ వ్యాలీల మధ్య ఇప్పటికే బలమైన బంధం ఉంది. ఇక్కడి టెక్ కంపెనీలకు ఇండియా నైపుణ్యాన్ని, నైపుణ్యవంతులను ఎగుమతి చేస్తోంది. ఇండియన్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా ఐఐటీయన్లు, ఇతర సంస్థలకు చెందిన వారు తయారు చేస్తున్న ఉత్పత్తులు ప్రపంచ సాంకేతిక రంగాన్ని పరిగెత్తిస్తున్నాయి" అని ఆయన అన్నారు. ఇండియాలో టెక్ విప్లవం వస్తోందని, దీంతో గ్రామీణ భారతావనిలోని ప్రజలకు పలు సేవలు దగ్గర కానున్నాయని, వారంతా ఆన్ లైన్ పరిధిలోకి రానున్నారని, తక్కువ ధరకు బ్యాండ్ విడ్త్, ఆఫ్ లైన్ స్ట్రాటజీ, అందుబాటు ధరల్లో మొబైల్ ఫోన్లు లభించడం ఇండియా అవకాశాలను మెరుగు పరుస్తోందని పిచాయ్ అభిప్రాయపడ్డారు.