: వైసీపీ సదస్సులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏయూ ప్రొఫెసర్ల వ్యాఖ్యలు!... చర్యలు తీసుకునే యోచనలో సర్కార్
విశాఖపట్నంలోని కళావాణి పోర్టు స్టేడియంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి యువభేరి సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు విద్యార్థులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారని తాజాగా తెలిసింది. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కారణం నాటి సభలో ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు. అయితే కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ఈ క్రమంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఏయూ వీసీ ఆచార్య జిఎన్ఎన్ రాజు ప్రశ్నించారు. నాటి సదస్సుల్లో వర్శిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు పాల్గొన్నారని తెలిసిందని, వారిని సస్పెండ్ చేస్తారా? లేదా నోటీసు ఇస్తారా? అని మంత్రి అడిగారు. అయితే అందరిపైన కాకపోయినా కొందరిపై సస్పెన్షన్ వేటు తప్పక పడుతుందని వర్సిటీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ విషయాన్నంతటినీ మంత్రి గంటా కూడా ధ్రువీకరించారు.