: హైదరాబాదు పోలీసుల అరాచకం... వాట్సప్ లో వీడియో హల్ చల్
హైదరాబాదు పోలీసులు మరో అరాచక పర్వానికి పాల్పడ్డారు. నగరంలోని ఉప్పల్ పరిధిలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పోలీసుల అరాచక పర్వానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వాట్సప్ లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకెళితే... ఉప్పల్ నల్ల చెరువు కట్టపై పండ్లు, వేరుశనక్కాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారులపై హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడ్డారు. తోపుడు బండ్లు, బుట్టల్లోని పండ్లు, వేరుశనక్కాయలను చెల్లాచెదురు చేయడంతో పాటు వాటిలో కొన్నింటిని తమ వాహనంలోకి ఎక్కించేశారు. చిరువ్యాపారులమంటూ బాధితులు కాళ్లావేళ్లా పడ్డా పోలీసులు కనికరించలేదు. దీనిని గమనించిన ఓ యువకుడు వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి, ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. ఈ వీడియోను అతడు నిన్న వాట్సప్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సప్ లో హల్ చల్ చేస్తోంది. దీంతో పోలీసులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్న కారణంగానే చిరువ్యాపారులను అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందని ఉప్పల్ ట్రాఫిక్ సీఐ జానకి రెడ్డి వివరణ ఇచ్చారు.