: పోప్ కోసం ఐదేళ్ల చిన్నారి సాహసం, తండ్రి కంట ఆనందబాష్పాలు
పోప్ ఫ్రాన్సిస్... ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లకు నడిచొచ్చే దైవ స్వరూపం. అటువంటి వ్యక్తి కళ్ల ముందు ఉన్నారు. చాలా దగ్గరగా ఉన్నారు. ఒక్క బారికేడ్ దాటి పరుగుతీస్తే, క్షణాల్లో ఆయన వద్దకు చేరుకోవచ్చు. తన తండ్రి బాధను, ఆయనలాగే వేలాది మంది ప్రజలు పడుతున్న బాధను ఆయనకు చెప్పుకోవచ్చు. ఈ ఆలోచన వచ్చింది ఎవరికో తెలుసా? ఐదేళ్ల చిన్నారి సోఫియా క్రజ్ కు. పోప్ ఫ్రాన్సిస్ అమెరికా పర్యటనలో ఉన్న వేళ, ఆయన కాన్వాయ్ నెమ్మదిగా కదులుతుంటే, తనను చూసేందుకు వచ్చి రహదారుల వెంట నిలబడ్డ వారిని చేతులు ఊపుతూ చిరునవ్వుతో పోప్ సాగుతున్న సమయాన, రహస్య భద్రతా అధికారుల కన్నుగప్పి, సెక్యూరిటీ బారికేడ్లను దూకింది సోఫియా. ఆయన వద్దకు పరుగు పెట్టింది. భద్రతా దళం మధ్యలోనే పాపను అడ్డగించినా, పోప్ వారిని వారించి పాపను దగ్గరకు పిలిచాడు. ఆయన వద్దకు వెళ్లిన పాప ఓ వినతిపత్రాన్ని అందించింది. దాన్ని స్వీకరించిన పోప్ రెండు నిమిషాలు పాపతో మాట్లాడాడు. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టాడు. ఆ పాప ధైర్యానికి అక్కడున్న వారంతా విస్తుపోగా, తన కూతురు చేసిన పనికి ఆమె తండ్రి కళ్ల వెంట ఆనందబాష్పాలు రాలాయి. ఈ దృశ్యమంతటినీ కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, లక్షలాది లైక్ లు వస్తున్నాయి. ఆ పాప అమెరికన్ భూమిపై మెక్సికన్ తల్లిదండ్రులకు జన్మించింది. అమెరికాకు వలస వచ్చిన వారి కష్టాలను చూస్తూ పెరిగింది. యూఎస్ లో సరైన పత్రాలు లేకుండా సంక్షేమానికి దూరంగా, దుర్భర జీవనానికి దగ్గరగా బతుకులు వెళ్లదీస్తున్న వారికి సహాయపడాలని ఆ పాప పోప్ కు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో రాసిన లేఖలో కోరింది. ఆ పాప కథను బ్రిటన్ కు చెందిన 'గార్డియన్' ప్రత్యేక ఇంటర్వ్యూ చేసి మరీ ప్రచురించింది. పోప్ దగ్గరకు వెళ్లాలని తనకెవరూ చెప్పలేదని ఆ పాప వెల్లడించినట్టు పత్రిక తెలిపింది. అమెరికాలో గౌరవంగా బతకాలన్నదే తన కోరికని, వలస విధానంలో సంస్కరణలు రావాల్సి వుందని పెద్ద ఆరిందా మాదిరిగా ఇంటర్వ్యూ ఇచ్చింది. కాగా, ఈ పాప తల్లిదండ్రులు కూడా సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉంటున్నారా? అన్న విషయం తెలియరాలేదని ఓ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. "ఐదేళ్ల చిన్నారి తన కథను నేడు పోప్ ఫ్రాన్సిస్ కు తెలియజేసింది. ఇమిగ్రేషన్ సంస్కరణలు మనకెంత అవసరమో తెలియజెప్పింది" అని డెమోక్రాటిక్ సెనెటార్ డిక్ డుర్బిన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.