: చంద్రబాబుకు లేఖ రాసి, రైతు ఆత్మహత్య... ఒక్క రోజు ముందు అందినా..!
సింహాద్రి వెంకటేశ్వరరావు... పశ్చిమ గోదావరి జిల్లా యర్నగూడెంకు చెందిన పొగాకు రైతు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తూ స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తరువాత మంగళవారం నాడు వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకోగా, నిన్న సీఎం కార్యాలయానికి ఆ లేఖ చేరింది. ముఖ్యమంత్రి భద్రత కోసం రూ. 5.5 కోట్లు పెట్టి ప్రత్యేక బస్సును తయారు చేయించారని, అలాగే పొగాకు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. ఈ సీజనులో పంట పరిమితిని 25 క్వింటాళ్లకు తగ్గించడాన్ని తప్పుబట్టిన ఆయన, ఒక్కో పొగాకు బ్యారన్ కు రూ. 9 లక్షల చొప్పున పరిహారం ఇస్తే, తమ బ్యారన్ లైసెన్సులను స్వచ్ఛందంగా వదులుకుంటామని వివరించారు. పొగాకు రైతులందరి కోసం తాను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు వెంకటేశ్వరరావు రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్క రోజు ముందు ఈ లేఖ అందినా, ఆయన ప్రాణాలు నిలిపేవారమని అధికారులు వ్యాఖ్యానించారు.