: ఏపీకి ‘హోదా’ హుళక్కేనట!... తెలంగాణ ఎంపీ గుత్తా సంచలన వ్యాఖ్య


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్రంలోని అధికార పార్టీతో పాటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్రం పెద్దలతో ఇదే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ఇక విపక్షాలు రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి (కాంగ్రెస్) నిన్న సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని గుత్తా కుండబద్దలు కొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తనకు స్పష్టంగా తెలిపిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయంపై తాను రాసిన లేఖకు కేంద్ర ప్రణాళిక, రక్షణ శాఖ సహాయ మంత్రి ఇందర్ జిత్ సింగ్ సవివరంగా సమాధానమిచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఉన్న అర్హతలు, ప్రాతిపదికను మార్చే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి ఆ సమాధానంలో వివరించారన్నారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కేనని గుత్తా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News