: సాలీడు పాకుతోందని కదులుతున్న కారులోంచి దూకేసింది
చిన్న చిన్న ఘటనలకు కొంత మంది అతిగా స్పందిస్తుంటారు. బాత్రూంలో బొద్దింకలు, బల్లులు కనపడితే కొంత మంది భయంతో గట్టిగా అరుస్తారు. మరికొంతమంది కొంపమునిగిపోయినట్టు పరుగెత్తుకుంటూ వచ్చి నానా గందరగోళం సృష్టిస్తారు. అమెరికాలోని ఇండియానా స్టేట్ లో సిరాక్యూజ్ కు చెందిన ఏంజెలా కిప్ (35) అనే మహిళ తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి కారు డ్రైవ్ చేస్తూ ప్రయాణిస్తుండగా, భుజంపై సాలీడు పాకడాన్ని గుర్తించింది. అంతే... పూనకం వచ్చిన దానిలా డ్రైవింగ్ చేస్తున్నానన్న స్పృహ కూడా లేకుండా, కదులుతున్న కారులోంచి బయటకి దూకేసింది. తల్లి బయటకి దూకేయడం గమనించిన కుమారుడు డ్రైవింగ్ సీట్లోకి దూకి కారును ఆపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బ్రేక్ కు బదులు గ్యాస్ పెడల్ పై కాలు వేశాడు. దీంతో కారు మరింత వేగంగా వెళ్లి ఓ స్కూలు వ్యాన్ ను ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జయినా పిల్లాడు మాత్రం స్వల్పగాయాలతో బయటపడడం విశేషం. దీంతో బాలుడ్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. కాగా, ఇలా చిన్న చిన్న విషయాలకు భయపడడాన్ని 'ఆర్కానో ఫోబియా' అంటారని వైద్య నిపుణులు తెలిపారు.