: టీమిండియా బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్?
టీమిండియా బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియమించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. స్వింగ్ బౌలింగ్ తో సత్తాచాటిన జహీర్ ను టీమిండియా బౌలింగ్ కోచ్ గా నియమిస్తే, ఆటగాళ్లు గాడిన పడే అవకాశముందని బీసీసీఐ భావిస్తోంది. భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్ని వంటి ఆటగాళ్లు అడపాదడపా మంచి ప్రదర్శన కనబరుస్తున్నా, ఉత్తమ ప్రతిభ కనబరచడంలో విఫలమవుతున్నారు. రంజీల్లో మంచి ఫాంలో ఉన్న ఆటగాళ్లు కూడా అంతర్జాతీయ వేదికలపై తడబడుతున్నారు. స్పిన్నర్లు రాణించేటప్పుడు, పేసర్లు కూడా ఓ చేయి వేయడం తప్పితే, పేస్ బౌలర్ల కారణంగా మ్యాచ్ లు గెలిచిన సందర్భాలు వేళ్లపై లెక్కబెట్టవచ్చంటే అతిశయోక్తికాదు. గతంలో టీమిండియా బ్యాట్స్ మన్ ప్రత్యర్థులకు భారీ లక్ష్యాలు నిర్దేశిస్తే...బౌలర్లు వారి పనిపట్టేసేశారు. ముఖ్యంగా జహీర్ ఖాన్ ఫస్ట్ స్పెల్ లో వికెట్లు తీయనిదే నిద్రపోయేవాడు కాదు. స్వింగర్లు, యార్కర్లను అద్భుతంగా సంధించే జహీర్ బౌలింగ్ కోచ్ అయితే యువ ఆటగాళ్లకు ఎంతో లాభిస్తుందని నిపుణులు చెబుతున్నా, కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ వంటి సీనియర్లు ఉండగా, జహీర్ ను టీమిండియా బౌలింగ్ కోచ్ గా నియమిస్తారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.