: పరుగు పెట్టిస్తుందా? బ్రేకులు వేస్తుందా? ఆర్బీఐ నిర్ణయం ఎటువైపో!
మరోవారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో రెపో రేటును తగ్గించడం ద్వారా ప్రజలపై వడ్డీల భారాన్ని కొంతమేరకైనా తొలగించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ వస్తుండగా, తాజాగా, మోదీ సర్కారు సైతం అదే కోరుతోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ "ఇంగితజ్ఞానం ఉన్నవారెవరైనా వడ్డీ రేట్లు తగ్గే పరిస్థితి వుందని అంగీకరిస్తారు" అని అంటూనే, వడ్డీల తగ్గింపుపై తుది నిర్ణయం ఆర్బీఐదేనని వ్యాఖ్యానించారు. దీంతో ఆర్బీఐపై ముఖ్యంగా గవర్నర్ రఘురాం రాజన్ పై ఒత్తిడి మరింతగా పెరిగినట్లయింది. ద్రవ్యోల్బణం సంతృప్తికరంగా వున్నందున ఈసారి ఎలాగైనా కీలక రేట్లను సవరించాలని పలు వర్గాలు కోరుతుండగా, రాజన్ మాత్రం "తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు" అని అన్నారు. పలు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగానే వున్నాయని, వర్షపాతం సక్రమంగా లేక ఖరీఫ్ సీజన్ అంతంతమాత్రంగా వున్న వేళ వడ్డీలను తగ్గిస్తే, వృద్ధి రేటు పెరిగే మాట అటుంచి, సంక్షోభ ఛాయలు పెరుగుతాయని కొందరు నిపుణులు వ్యాఖ్యానించారు. ఇన్ ఫ్లేషన్ తగ్గివచ్చిందంటే, అది అంతర్జాతీయ స్థాయి పరిణామాల కారణంగానేనని, కేవలం ముడి చమురు ధరలు ఏడున్నరేళ్ల కనిష్ఠానికి చేరడంతో ద్రవ్యోల్బణం తగ్గిందని గుర్తు చేస్తున్నారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు వృద్ధి అంచనాలను తగ్గించిన వేళ, చైనాలో నెలకొన్న మాంద్యాన్ని ఇండియాకు లాభంగా మార్చుకోవాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలని సూచిస్తున్న వారి సంఖ్యే అధికంగా వుంది. ఇక ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ అడుగులు రేట్ కట్ వైపు పడి మార్కెట్ ను పరుగులు పెట్టిస్తాయో... లేక వడ్డీ రేట్ల జోలికి పోకుండా మార్కెట్ వర్గాలను నిరాశకు గురి చేస్తాయో మరో వారంలో తేలుతుంది.