: 15 నెలలుగా ఆ తల్లీ కూతుళ్ల మకాం ఎయిర్ పోర్టులోనే... అన్నీ అక్కడే!


వారిద్దరూ తల్లీకూతుళ్లు. పొద్దున్నే లేస్తారు. విమానాశ్రయంలోని బాత్ రూములను వాడుకుని కాలకృత్యాలు తీర్చుకుంటారు. అక్కడి రెస్టారెంట్లలో తింటారు. వైఫై సాయంతో స్మార్ట్ ఫోన్లను వాడుతారు. షాపింగ్ సెంటర్లు తిరుగుతారు. రాత్రి అయితే, నేలపై పడుకొని నిద్రపోతారు. తెల్లారి లేస్తే షరా మామూలు. గత 15 నెలలుగా సైప్రస్ లోని లార్ నాకా ఎయిర్ పోర్టులో వీరు మకాం వేశారు. వీరిద్దరూ జర్మనీకి చెందిన వారు. ఇజ్రాయిల్ లో కొంతకాలం వున్నారు. వీసా గడువు తీరిపోయినా, దేశం వీడలేదంటూ, వీరిద్దరినీ ఇజ్రాయిల్ బలవంతంగా పంపించేసింది. తిరిగి అక్కడికే వెళ్లాలన్నది వీరి కోరిక. "జర్మనీ పంపుతాం వెళ్లండి" అని ఎయిర్ పోర్టు అధికారులు మొత్తుకుంటున్నా వారు వినట్లేదు. ఇంతకాలమూ మానవత్వాన్ని ప్రదర్శించి మిన్నకున్నామని, ఇక వీరిని బలవంతంగా తరలిస్తామని అధికారులు చెబుతుండగా, వీరిద్దరూ తమ సాయం కోరలేదని జర్మన్ ఎంబసీ స్పష్టం చేసింది. కాగా, వీరి గురించి తెలిసిన వారు 'ద టెర్మినల్' చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఫ్రాన్స్ లోని చార్లెస్ డె గౌలీ విమానాశ్రయంలో ఇరాన్ శరణార్థి మెహ్రాన్ కారిమి ఎనిమిదేళ్లు గడిపిన కథ ఆధారంగా ఈ చిత్రం తీసిన సంగతి తెలిసిందే. మరిక ఈ తల్లీకూతుళ్ల కథ ఎటు వెడుతుందో?!

  • Loading...

More Telugu News