: వోక్స్ వాగన్ మోసాన్ని బయటపెట్టిన చిరుద్యోగి... ఎలాగంటే!
ప్రపంచ వాహన చరిత్రలో అతిపెద్ద కుంభకోణం అది. తప్పుడు ధ్రువీకరణలతో అటు పలు దేశాల ప్రభుత్వాలను మోసం చేసి, నమ్మకంతో కార్లను కొన్న కస్టమర్లను 15 సంవత్సరాల నుంచి వంచిస్తూ వచ్చిన వోక్స్ వాగన్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంది. అసలు సంస్థ కార్ల ఇంజన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తొలుత కనుగొంది ఓ చిన్న ఇంజనీర్. వెస్ట్ వర్జీనియాకు చెందిన 45 సంవత్సరాల డేనియల్ కార్డర్ ఇప్పుడు స్టార్ హీరో. వరల్డ్స్ మోస్ట్ పవర్ ఫుల్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న వోక్స్ వాగన్ చేస్తున్న దారుణ మోసాన్ని తొలుత కనుగొన్నది ఈయనే. వెస్ట్ వర్జీనియా యూనివర్శీటీకి చెందిన ఐదుగురు సభ్యుల రీసెర్చ్ టీం 50 వేల డాలర్లు వెచ్చించి ఓ అధ్యయనం చేపట్టగా, అందులో భాగంగానే కార్డర్ వోక్స్ కార్ల లోపాన్ని పసిగట్టాడు. అమెరికన్ నిబంధనలను ఈ కార్లు పాటించడం లేదని తాము గుర్తించిన లోపం ఇంత పెద్ద సంచలనం అవుతుందని ఎంతమాత్రమూ ఊహించలేదని కార్డర్ వ్యాఖ్యానించారు. 2012లో ప్రారంభించిన తమ అధ్యయనం మే 2013లో పూర్తి చేశామని, ఈ అధ్యయనం వివరాలను ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ విభాగానికి అందించామని ఆయన తెలిపారు. తన టీమ్ లో ఓ రీసెర్చ్ ప్రొఫెసర్, ఇద్దరు గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఓ ఫ్యాకల్టీ మెంబర్ ఉన్నారని, లాస్ ఏంజిల్స్ నుంచి సియాటెల్ వరకూ వివిధ వాహనాలను తాము పరిశీలించామని తెలిపారు. వోక్స్ తయారు చేసిన కార్లలో ఒక వాహనం 15 నుంచి 35 రెట్ల వరకూ కర్బన ఉద్గారాలు విడుదల చేయగా, అదే మోడల్ కు చెందిన మరో కారు 10 నుంచి 20 రెట్ల కాలుష్యాన్ని వెదజల్లిందని, అప్పుడే తమకు అనుమానం వచ్చి మరింత లోతుగా పరిశోధనలు చేశామని వివరించారు. తొలుత ఫ్యూయల్ ఇంజక్షన్ వ్యూహంలో జరిగిన మార్పుల కారణంగా ఇలా అయి ఉండవచ్చని భావించామని, మరింత మైలేజీ కోసం కస్టమర్ స్వల్ప మార్పులు చేయించుకుని ఉంటారని అనుకొన్నామని తెలిపారు. తమ అధ్యయనం వివరాలను ప్రజల కోసం బహిరంగ పరిస్తే, వోక్స్ వాగన్ తప్పుబట్టిందని, తమపై ప్రశ్నల వర్షం కురిపించిందని, సంస్థ పరువు తీసేందుకు ఇలా తప్పుడు స్టడీ చేశారని దుయ్యబట్టిందని కార్డర్ తెలియజేశారు. ఆ తరువాత యూరోపియన్ కమిషన్ తో కలసి సంయుక్త రీసెర్చ్ చేశామని, వోక్స్ కార్లలో టెస్ట్ రిజల్ట్స్, రోడ్లపై కారు పనితీరులో సమూల మార్పులు ఉన్నాయని గమనించామని అన్నారు. వోక్స్ మార్కెటింగ్ చేస్తున్న 'పస్సాట్', 'జెట్టా'లతో పాటు బీఎండబ్ల్యూ ఎక్స్-5పై రీసెర్చ్ చేయగా, బీఎండబ్ల్యూ పనితీరు సంతృప్తికరంగా ఉందని వివరించారు. ఇప్పుడు తమపై ప్రశంసల వర్షం కురుస్తోందని, తనకెంతో ఆనందంగా ఉందని కార్డర్ గర్వంగా చెప్పుకొచ్చారు.