: శరీరంపై లాఠీలు విరుగుతున్నా కదలని సాధువులు!
వారు సర్వసంగ పరిత్యాగులు. ఒంటిపై కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు తప్ప మరేమీ వారి వద్ద కనిపించవు. నిత్యమూ ధ్యానంలో ఉండే సాధువులపై కర్కశ పోలీసుల లాఠీలు తాండవిస్తుంటే, రెండు చేతులూ బార్లా చాపి, ఎలా కావాలంటే అలా కొట్టుకోమని నిశ్చలంగా నిలుచుండి పోయారే తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. శరీరంపై లాఠీలు విరుగుతున్నా వారి మనోధైర్యం చెక్కు చెదరలేదు. ఈ ఘటనలు వారణాసిలో జరిగాయి. గంగా నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని పోలీసులు, అది సంప్రదాయాలకు విరుద్ధమని సాధువులు భీష్మించుకు కూర్చోవడంతో వారణాసిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో ప్రజల వాగ్వాదం, సాధువులపై పోలీసుల దాడుల దృశ్యాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. నిశ్చలంగా నిలబడ్డ వారిని దయారహితంగా కొట్టి, వెనక్కు లాగుతున్న దృశ్యాలు జాతీయ మీడియాలో తీవ్ర చర్చనీయాంశాలయ్యాయి. పలు టీవీ చానళ్లు ఈ ఉదయం చర్చా కార్యక్రమాల్లో భాగంగా, వారణాసిలో సాధువులపై జరిగిన దాడినే ప్రధానాంశం చేసుకున్నాయి. ఈ ఘటనతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో బీజేపీ పడిపోయిందని స్వయంగా ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.