: నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు: సినీ నటి లయ
అమెరికాలో ఉన్న టాలీవుడ్ సినీ నటి లయకు యాక్సిడెంట్ అయిందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. లాస్ ఏంజెలెస్ నుంచి కాలిఫోర్నియా వెళ్లే దారిలో లయకు ప్రమాదం జరిగిందన్న వార్తలు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో కూడా వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే, ఈ వార్తలన్నీ పుకార్లేనని లయ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. "నాకు ప్రమాదం జరిగిందన్న వార్త పుకారు మాత్రమే. లేని వార్తను క్రియేట్ చేశారు. ఒక వార్తను ప్రసారం చేయడం లేదా ప్రచురించే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఈ వార్తలను చూసిన నా బంధువులు, స్నేహితులు చాలా కలవరపడ్డారు. కంటిన్యూయస్ గా నా ఫోన్ కు కాల్స్ వచ్చాయి. ఈ ఉదంతంతో, వ్యక్తిగతంగా తాను చాలా భయపడ్డాను" అని లయ వీడియోలో చెప్పింది. తన క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.