: తెలంగాణ ఏఏజీపై కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్ రావుపై న్యాయవాది పి.కరుణాకర్ రెడ్డి కేంద్ర న్యాయశాఖకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా రామచందర్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని కరుణాకర్ రెడ్డి చెప్పారు. దానిపై కేంద్ర న్యాయశాఖ స్పందించిందన్నారు. రెండు నెలల కిందట రేవంత్ బెయిల్ ను సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టుకు వెళ్లగా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఆ సమయంలో అదనపు అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఉమ్మడి హైకోర్టులో నిష్పాక్షిక నిర్ణయాలు జరగడం లేదని, ప్రత్యేక కోర్టు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులను ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.