: 1.1 కోట్ల వోక్స్ వాగన్ కార్లు నిబంధనలకు విరుద్ధం... 'మేడిన్ జర్మనీ' ఇమేజ్ పై మాయని మచ్చ!
వోక్స్ వాగన్... ప్రపంచంలోనే అతిపెద్ద వాహన సంస్థ. ఈ సంస్థ విక్రయించే లగ్జరీ వాహనాలు నిత్యమూ వందల సంఖ్యలో అమ్ముడవుతూ ఉంటాయి. సంస్థ లాభాలు సైతం వేల కోట్ల రూపాయల పైమాటే. ఇదంతా నిన్నటి మాట. నేడు ఆ సంస్థ కుదేలైంది. వోక్స్ వాగన్ వాడిన కార్ల ఇంజన్లు పర్యావరణ నిబంధనలను పాటించడం లేదని, ఈ కార్ల నుంచి విష వాయువులు నిర్ణీత ప్రమాణాల కన్నా అధికంగా వెలువడుతున్నాయని యూఎస్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఆకాశాన ఉన్న వోక్స్ వాగన్ పాతాళానికి పడిపోయింది. రెండు రోజుల వ్యవధిలో సంస్థ 20 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.30 లక్షల కోట్లు) నష్టపోయింది. యూఎస్ మార్కెట్లో సంస్థ ఈక్విటీ విలువ తొలిసారిగా 20 శాతానికి మించి దిగజారింది. దీని ప్రభావం అన్ని దేశాల మార్కెట్లపైనా చూపింది. కాగా, కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం కూడా వోక్స్ వాగన్ ముందు లేదని వాహన రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 1.1 కోట్ల యూనిట్లలో ఇంజన్ లోపాలు ఉన్నాయని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ వింటర్ కోర్న్ స్వయంగా వెల్లడించారు. అమెరికా కర్బన ఉద్గారాల చట్టం ప్రకారం తమ కార్లు లేవని ఆయన అంగీకరించారు. వోక్స్ ను స్థాపించి 78 సంవత్సరాలైందని, సంస్థ చరిత్రలో ఇంత పెద్ద తప్పు ఎన్నడూ జరగలేదని, తమ క్లయింట్లకు క్షమాపణ చెబుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్లలో లోపాలను సరిదిద్దేందుకు మూడవ త్రైమాసికం లాభాల నుంచి 7.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 45 వేల కోట్లు) కేటాయిస్తామని వివరించారు. జరిగిన తప్పుకు పూర్తి బాధ్యత తమదేనన్నారు. అసలేం జరిగింది..?: వోక్స్ వాగన్ తన సొంత రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో ఈఏ 189 పేరిట ఓ అధునాతన ఇంజన్ ను అభివృద్ధి చేసింది. దీన్ని పరీక్షించినప్పుడు వెలువడిన కర్బన ఉద్గారాలు నిర్ణీత పరిమాణం కన్నా చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇదే ఇంజన్ తో కార్లను తయారు చేస్తున్నట్టు ఆ సంస్థ చెప్పుకుంది. కానీ జరిగింది వేరు. ఇంజన్ లో వాడిన సాంకేతికతను సంస్థ మార్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక పొరపాటున జరిగిందా? అన్న విషయం తెలియదుగానీ, ఈఏ 189 ఇంజన్ కలిగిన వాహనం రోడ్డుపైకి వచ్చేసరికి అధిక కాలుష్యాలను వెదజల్లుతోంది. సంవత్సరాల తరబడి దీన్ని ఎవరూ గమనించ లేదు. గతవారంలో యూఎస్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ దీన్ని కనుగొంది. దీంతో, 'మేడిన్ జర్మనీ' పేరును విశ్వవ్యాప్తం చేసిన వోక్స్ వాగన్ పేరు మసకబారగా, జర్మనీ పరువు పోయింది. ఇప్పుడిక ఈ సంస్థ కార్లపై పలు దేశాలు విచారణకు ఆదేశించాయి. వోక్స్ కార్ల అమ్మకాలు జరుగుతున్న ప్రతిదేశంలోనూ భారీ జరిమానాలు కట్టక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. క్లీన్ ఎయిర్ చట్టంతో పాటు, కస్టమర్లను మోసం చేశారని, తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చారని, నియంత్రణా సంస్థలను తప్పుడు గణాంకాలతో మోసం చేశారని... ఇలా పలు రకాల క్రిమినల్ కేసులనూ సంస్థ ఎదుర్కోనుంది.