: కొంపముంచిన వోక్స్ వాగన్... భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
జర్మన్ కేంద్రంగా పనిచేస్తున్న వాహన దిగ్గజం వోక్స్ వాగన్ లో నెలకొన్న సంక్షోభం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయగా, భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లో ఉన్న మార్కెట్లు యూరప్ సూచికల పతనం తరువాత 'బేర్' మన్నాయి. ఒకదశలో 600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్, చివరకు స్వల్పంగా తేరుకుని 541.14 పాయింట్లు పతనమై 2.07 శాతం నష్టంతో 25,651.84 పాయింట్లకు చేరింది. మిడ్ క్యాప్ 1.57 శాతం, స్మాల్ కాప్ 1.21 శాతం నష్టపోయాయి. మొత్తం 2,789 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 974 కంపెనీలు లాభాల్లోనూ, 1,705 కంపెనీలు నష్టాల్లోనూ నిలిచాయి. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 165.10 పాయింట్లు దిగజారి, 2.07 శాతం నష్టంతో 7,812.00 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ-50లో విప్రో మినహా మిగతా అన్ని ఈక్విటీలూ నష్టపోయాయి. కాగా, అమెరికా పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా వోక్స్ వాగన్ విక్రయించిన కార్లు లేవని యూఎస్ అధికారులు ప్రకటించిన తరువాత ఆ సంస్థ దాదాపు 17 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ కాప్ ను కోల్పోయింది. ఈ ప్రభావం మొత్తం యూరప్ మార్కెట్ పై పడింది. సాయంత్రం 4 గంటల సమయానికి యూరప్ మార్కెట్లలో ఎఫ్టీఎస్ఈ-100 2.44 శాతం నష్టంలో, సీఏసీ-40 3.49 శాతం నష్టంలో, డీఏఎక్స్ 3.30 నష్టంలో కొనసాగుతుండగా, డౌ జోన్స్ ఫ్యూచర్స్ 0.73 శాతం, ఎస్అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.87 శాతం నష్టంలో ఉన్నాయి.