: 'బుక్ మై షో'పై 'పేటీఎం' యుద్ధం!
ఇండియాలోని దాదాపు అన్ని పెద్ద మల్టీప్లెక్స్ ల టికెట్లను, ఎంటర్ టెయిన్ మెంట్ టికెట్లను విక్రయిస్తున్న నంబర్ వన్ సంస్థ 'బుక్ మై షో డాట్ కాం'పై డిజిటల్ పేమెంట్, ఎం-కామర్స్ సేవల సంస్థ పేటీఎం యుద్ధానికి దిగుతోంది. మూవీ టికెట్ల వ్యాపారంలోకి ప్రవేశించడం ద్వారా సాధ్యమైనంత మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని భావిస్తున్న సంస్థ వ్యవస్థాపక చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ ఇప్పటికే దేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ చెయిన్ నిర్వహిస్తున్న పీవీఆర్ తో డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 33 నగరాల్లోని 75 మల్టీప్లెక్స్ లలో 370 స్క్రీన్లను నిర్వహిస్తున్న పీవీఆర్ టికెట్లు ఇకపై పేటీఎంలో లభ్యం కానున్నాయి. తమకు బుక్ మై షోతో పోటీ లేదంటూనే, సాలీనా రూ. 3 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ రంగంలో 25 శాతం సినిమా టికెట్ల విక్రయాలు ఆన్ లైన్లో సాగుతున్నాయని, వాటిల్లో 30 శాతం మార్కెట్ వాటాగా 4.4 కోట్ల బుకింగ్స్ పీవీఆర్ వేనని శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పేటీఎం తో చర్చలు ముగిశాయని, అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని పీవీఆర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీనాక్షీ వాజ్ పేయి వ్యాఖ్యానించారు. స్వీయ బుకింగ్ సైట్లున్న అన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో తాము డీల్స్ కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నామని పేటీఎం ప్రకటించడంతో ఈ రంగాన్ని ఏలుతున్న బుక్ మై షో ముందుకు పెను సవాలు వచ్చినట్టేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే బుక్ మై షోతో చాలా సినిమా చైన్ కాంట్రాక్టులు కుదుర్చుకోవడంతో, పేటీఎం ఎలా నెగ్గుకు వస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.