: షాకింగ్... రూ. 14,46,50,00,00,000, అమెరికాకు కట్టిన భారత ఐటీ కంపెనీల పన్ను మొత్తం!
గడచిన ఐదేళ్లలో భారత ఐటీ కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి కట్టిన పన్నుల మొత్తం ఎంతో తెలుసా? దాదాపు 22 బిలియన్ డాలర్లకు పైనే. అంటే 1,44,650 కోట్ల రూపాయలు (ఒక డాలర్ మారకపు విలువ రూ. 65.75పై). ఇండియాకు సంబంధించినంత వరకూ ఇదో షాకింగ్ న్యూసే. ఈ డబ్బును ఇండియాలో వెచ్చించి వుంటే దాదాపు 5 కోట్ల మందికి శాశ్వత ఉపాధి లభించి వుండేది. నాస్కామ్ వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2011 నుంచి 2015 వరకూ అమెరికాలో పెట్టిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో దాదాపు 4.10 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని నాస్కామ్ తెలిపింది. ఈ నివేదికను కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేయగా, పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాలను భారత కంపెనీలు హరించి వేస్తున్నాయని ఆ దేశంలో జరుగుతున్న వాదన తప్పని తేలింది. అమెరికాలో శాఖలు నడుపుతున్న భారత కంపెనీలు అర కోటి మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నాయి. వేలాది అమెరికన్ కంపెనీలకు అవసరమైన ఐటీ సేవలను తక్కువ ధరలకు అందిస్తున్నాయి. కాగా, ఈ నివేదిక ప్రకారం, గడచిన ఏడేళ్లలో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్యం విలువ 580 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 38.13 లక్షల కోట్లు). ఒక్క 2014లోనే 103 బిలియన్ డాలర్ల (రూ. 6.77 లక్షల కోట్లు) వాణిజ్యం నమోదైంది. అమెరికాలో భారతీయులు పెట్టిన పెట్టుబడి 7.1 (సుమారు రూ. 46,682 కోట్లు) బిలియన్ డాలర్లు కాగా, ఇండియాలో యూఎస్ ఎఫ్డీఏ 24.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.58 లక్షల కోట్లు కోట్లు)గా నమోదైంది.