: మోదీ సర్కారుపై మాయావతి ధ్వజం... సీబీఐ దర్యాప్తు రాజకీయ కుట్రలో భాగమేనని వ్యాఖ్య
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి మరోమారు బీజేపీపై నిప్పులు చెరిగారు. ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసిన హెల్త్ స్కాంపై సీబీఐ దర్యాప్తు వేగవంతమైన నేపథ్యంలో ఆమె నరేంద్ర మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఈ కేసులో మాయావతికి కూడా ప్రత్యక్ష పాత్ర ఉందని, త్వరలోనే ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె ఘాటుగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపైనే కాక తన పార్టీపైనా సీబీఐని నరేంద్ర మోదీ ప్రయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా స్థాయికి తగ్గ రాజకీయాలు చేయాలని ఆమె ఎన్డీఏ ప్రభుత్వానికి సూచించారు. సీబీఐ విచారణలు తననేమి చేయలేవని కూడా మాయావతి వ్యాఖ్యానించారు.