: పట్టిసీమ ‘మోటార్’పై వివాదం...‘హంద్రీ’ పంపును తరలించారన్న వైసీపీ, లేదన్న ‘మేఘా’
పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు సర్కారు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేయగలిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేసింది. తద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. నాలుగు రోజుల క్రితం ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టిసీమ విద్యుత్ మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అయితే మంత్రి స్విచ్ ఆన్ చేసిన మోటారు కొత్తది కావని, ఆ మెటారు హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు పరిధిలోని మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన మోటారేనని వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు నిన్న మల్యాల ప్రాజెక్టు వద్దకు వెళ్లిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య(వైసీపీ) ఇంజినీరింగ్ అధికారులను నిలదీశారు. విద్యుత్ మోటారును గుట్టుచప్పుడు కాకుండా ఎలా తరలిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు చూపాలని, లేకపోతే పోలీసు కేసు పెడతానని కూడా ఆయన హెచ్చరించారు. అయితే పట్టిసీమకు మల్యాల మోటారును తరలించలేదని మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఇప్పటికే నాలుగు మోటార్లు, పంపులను పట్టిసీమకు చేరవేశామని ఆ సంస్థ తెలిపింది. సివిల్ పనులు పూర్తి కాని నేపథ్యంలోనే మోటార్లను పక్కనపెట్టామని తెలిపింది. మల్యాల విద్యుత్ మోటారు తరలింపుపై ఓ వర్గం మీడియా తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని కూడా ఆ సంస్థ ఆరోపించింది.