: అమెరికాలో కొత్త భయం... 'ఇస్లామోఫోబియా'!
వారందరూ అమెరికన్లే... తరతరాలుగా అమెరికా గడ్డపై జీవిస్తున్నావారే. కానీ ముస్లింలు. ఇప్పుడు వారిని వెంటాడుతున్న భయం 'ఇస్లామోఫోబియా'. అమెరికా వ్యాప్తంగా 28 లక్షల మంది వరకూ ముస్లింలు వుండగా, వీరంతా అమెరికన్లు కాదంటూ, కొత్త ప్రచారం జరుగుతుండటం, వారి కంటిపై నిద్ర లేకుండా చేస్తోంది. రిపబ్లికన్ పార్టీల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్, బెన్ కార్సన్ లు చేస్తున్న ప్రచారం వీరికి మరింత ఆందోళన కలిగిస్తోంది. వీరి ప్రసంగాల తరువాత దక్షిణ కాలిఫోర్నియాలోని ఇస్లామిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆరంజ్ కౌంటీపై కొందరు తెల్లజాతీయులు దాడులు చేయగా, అక్కడి మహిళలు, చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. డొనాల్డ్, కార్సన్ లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం వర్గంపై కోపతాపాలు పెరిగేలా ప్రసంగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్లాం ఉగ్రవాదం కారణంగానే అమెరికాపై దాడులు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకోవాలని వీరిద్దరూ ప్రచారం చేస్తుండటంతో, ముస్లింలపై దాదులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ట్రంప్ అయితే, ఏకంగా అధ్యక్షుడు ఒబామా మతాన్ని ప్రస్తావిస్తూ, "దేశంలోని క్రిస్టియన్లపై ఒబామా యుద్ధం చేస్తున్నారు. ఈ దేశంలోని క్రిస్టియన్లకు మద్దతు కావాలి. వారి మతం, స్వాతంత్ర్యంపై దాడులు పెరుగుతున్నాయి" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి మాటలతో తాము మరింత భయాందోళనలకు గురవుతున్నామని అమెరికన్ ముస్లింలు వెల్లడించారు. కాగా, గత వారంలో ఓ 14 ఏళ్ల ముస్లిం విద్యార్థి, తన ప్రతిభతో ఇంట్లోనే గడియారం తయారు చేస్తే, దాన్ని బాంబుగా భావించిన పోలీసులు, ఆ బాలుడి చేతులకు బేడీలు వేసి మరీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికన్ క్రిస్టియన్లలో 'ఇస్లామోఫోబియా' పెరగడంతోనే ఈ తరహా చర్యలు జరుగుతున్నాయని ముస్లిం వర్గాలు వ్యాఖ్యానించాయి.