: కొత్త న్యూస్... ఆనాటి ఎమర్జెన్సీని ఆర్ఎస్ఎస్ వెనకేసుకొచ్చిందట!
ఇందిరాగాంధీ దేశంలో అత్యయక స్థితిని ప్రకటించినప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతిచ్చిందని, అప్పట్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న బాలాసాహెబ్ దియోరాస్ ఇందిరాగాంధీతో సత్సంబంధాల కోసం యత్నించారని ఇంటెలిజన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీవీ రాజేశ్వర్ ఓ సరికొత్త వ్యాఖ్య చేశారు. అప్పట్లో ఎమర్జెన్సీ విధించడంపై జరిగే పరిణామాలపై ఇందిరకు అవగాహన ఉందని, అయితే, అది ప్రజలపై ఎంతటి పెను ప్రభావం చూపుతుందన్న సంగతిని ఆమె సరిగ్గా అంచనా వేయలేకపోయారని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ఐబీ విభాగానికి డిప్యూటీ చీఫ్ గా రాజేశ్వర్ పని చేశారు. తొలుత ఆరు నెలల తరువాత ఎమర్జెన్సీని తీసివేయాలని ఇందిర భావించారని, ఆ ఆరు నెలల్లో జరిగిన పరిణామాలు ఆమెను మార్చి వేశాయని అన్నారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజేశ్వర్, ఇందిరాగాంధీతో పాటు సంజయ్ గాంధీతో సైతం బంధాన్ని బలపరచుకునేందుకు ఆర్ఎస్ఎస్ యత్నించిందని వివరించారు. 'ది క్రూషియల్ ఇయర్స్' పేరిట ఆయన రాసిన పుస్తకం ఎమర్జెన్సీ సమయంలో ఎవరికీ తెలియని కొత్త కోణాలను ప్రజల ముందు ఉంచింది. ఇందిరకు ఎమర్జెన్సీ విధించాలన్న ఆలోచనను కల్పించింది సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధార్థ శంకర్ రే అని, ఆయన చెప్పిన మరుసటి రోజే దేశంలో అత్యయక పరిస్థితిని ఇందిర విధించారని రాజేశ్వర్ తెలిపారు.