: విశాఖ పోలీసు ‘బ్యాచిలర్స్’కు పెద్ద చిక్కొచ్చింది!
విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న అవివాహిత పోలీసులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఉద్యోగం వచ్చింది కదా, ఇక పెళ్లి చేసుకుందామనుకునే విశాఖ పోలీస్ బ్యాచిలర్స్ కు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో సదరు పోలీస్ బ్యాచిలర్స్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా, సంబంధాలు కుదరడం లేదని వారు వాపోతున్నారు. అయినా పోలీసు ఉద్యోగం వచ్చిన విశాఖ యువకులకు పిల్లనిచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు చెబుతున్న కారణమేంటో తెలుసా? మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పెద్ద ముప్పు పొంచి ఉండటమేనట. విశాఖ జిల్లా పోలీసు శాఖ కింద 43 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 17 పోలీస్ స్టేషన్లు ఆ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 11 మండలాల్లో ఉన్నాయి. ఈ మండలాల్లో కొయ్యూరు, జి.మాడుగుల, జీకే వీధి, చింతపల్లి, సీలేరు, అన్నవరం, ముంచంగిపుట్టు, పెదబయలు తదితర మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం నిజంగా అధికంగా ఉంది. దీంతో ఈ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి ఎప్పుడు, ఏ ముప్పు వాటిల్లుతుందో చెప్పలేని పరిస్థితి. అంతేకాక వివిధ అంశాల ప్రాతిపదికగా ఇక్కడ పనిచేసే పోలీసులకు త్వరగా పదోన్నతులు కూడా అందవట. దీంతోనే తమ అమ్మాయిలను విశాఖ పోలీస్ బ్యాచిలర్స్ కు ఇచ్చేందుకు అక్కడి వారు ఇష్టపడటం లేదట.